కేంద్రంపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు..!
X
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ వివరణ కోసం ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే కేంద్రం ఈ అంశంపై స్పందించకపోవడంతో విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం మళ్లీ కుదిపేసింది. విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే విపక్ష కూటమి అవిశ్వాసం చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మణిపూర్ అంశంపై ప్రధాని చర్చకు సిద్ధమైతే ఆ విషయంతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం లభిస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి. అటు రాజ్యసభలోనూ కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.