కేంద్రంపై అవిశ్వాసం.. ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్..!
X
కేంద్రంపై విపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రకటించే అవకాశముంది. మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అవిశ్వాసం పెట్టడం ద్వారా ప్రధాని స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, ఇతర అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) భావిస్తోంది.
కూటమి నేతల నిర్ణయం మేరకు బుధవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చే ఛాన్సుంది. ఇప్పటికే తీర్మానం ముసాయిదా సిద్ధం చేసిన విపక్షాలు దానిపై 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించింది. మరోవైపు ఉదయం10.30కు పార్లమెంటరీ కార్యాలయంలో హాజరుకావాలని ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.
విపక్షాల అవిశ్వాస తీర్మానం నిర్ణయంపై బీజేపీ స్పందించింది. అదో వృథా ప్రయాసని అభిప్రాయపడింది. 2018లో అవిశ్వాసం పెడితే అది వీగిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తమ బలం మరింత పెరిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమకు 350 మందికిపైగా సభ్యుల మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు.