Home > జాతీయం > ప్రభుత్వ రంగంలో 2లక్షల ఉద్యోగాలు తొలగించారు : రాహుల్

ప్రభుత్వ రంగంలో 2లక్షల ఉద్యోగాలు తొలగించారు : రాహుల్

ప్రభుత్వ రంగంలో 2లక్షల ఉద్యోగాలు తొలగించారు : రాహుల్
X

కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను కేంద్రం తొలగించిందని ఆరోపించారు. దీంతో లక్షలాది మంది యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. కొంత మంది పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ప్రభుత్వం ఈ పని చేసిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు తగ్గిపోవడం దేనికి సంకేతమని నిలదీశారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా ఉండేవని.. యువత ఉద్యోగ కలకు అవి నెలవుగా ఉండేవని రాహుల్ అన్నారు. కానీ నేడు ప్రభుత్వ ప్రాధాన్యాల్లోనే లేవని విమర్శించారు. ‘‘ప్రభుత్వరంగ సెక్టార్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండేవి. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయి. ప్రగతిశీల దేశంలో ఉద్యోగాలు తగ్గుతాయా? బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1,81,127 ఉద్యోగాలు పోయాయి. సెయిల్‌లో 61,928 ఉద్యోగాలు, ఎంటీఎన్‌ఎల్‌లో 34,997, ఎస్‌ఈసీఎల్‌లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్‌జీసీలో 21,120 ఉద్యోగాలు పోయాయి’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

నిరుద్యోగులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ హామీ ఏమైందిన రాహుల్ ప్రశ్నించారు. కేంద్రం ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని ఆరోపించారు. ప్రధానంగా కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్లు ఎక్కువయ్యాయని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పెంచడం అంటే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్‌ హక్కును హరించడం కాదా? అని ప్రశ్నించారు.

కేంద్రం నిర్ణయం వెనుక కంపెనీలను ప్రైవేటుపరం చేయాలనే కుట్రేమైనా ఉందా? అని రాహుల్ అడిగారు. పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలను కనుమరుగు చేయడం.. ఇదేం అమృత్‌కాల్‌ అని నిలదీశారు. పీఎస్‌యూలకు తగిన ప్రాధాన్యం ఇస్తే ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని.. వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.


Updated : 18 Jun 2023 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top