Seema Haider : బంపరాఫర్ కొట్టేసిన సీమా హైదర్..
X
ప్రేమించిన యువకుడి కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టిన సీమా హైదర్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పబ్జీ గేమ్ లో పరియమైన సచిన్ కోసం ఉత్తర్ ప్రదేశ్ కు వచ్చిన ఆమెకు సినిమా అవకాశం వచ్చింది. ఓ సినిమాలో పాత్ర కోసం ఆమెను సంప్రదించగా తాజాగా ఆడిషన్ సైతం పూర్తైంది.
"రా" ఏజెంట్ పాత్ర
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఘటన ఆధారంగా జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ ‘‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’’పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో "రా" ఏజెంట్ పాత్ర కోసం సీమాను సంప్రదించారు. మూవీ డైరెక్టర్లు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు మంగళవారం ఆమెకు ఆడిషన్ సైతం నిర్వహించారు. సినిమాలో పాత్రకు ఆమెను ఎంపిక చేశామని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని నిర్మాత అమిత్ జానీ చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులు
సీమా సచిన్ మీనాను వివాహం చేసుకున్న అనంతరం గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది. పోలీసుల నిఘా, మీడియా కారణంగా ఇల్లు మారాల్సి వచ్చిందని ఆ జంట చెబుతోంది. కొత్త ఇంటికి మారిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని వాపోయింది. తాను ఐఎస్ఐ ఏజెంట్ ను కాదని, ఎలాంటి దర్యాప్తు, పరీక్షలకైనా తాను సిద్ధమని సీమా స్పష్టం చేసింది.
ప్రియుడి కోసం
పబ్జీ గేమ్‌లో పరిచయమైన సచిన్ మీనా కోసం సీమా హైదర్ నలుగురు పిల్లలతో కలిసి పాక్ సరిహద్దును దాటి భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. ఆమె సోదరుడికి పాక్ సైన్యంతో సంబంధమున్నట్లు ఆమె భర్త మీడియాకు చెప్పాడు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన ఆమె సచిన్ ను పెళ్లి చేసుకుని నోయిడాలో ఉంటోంది.