మోడీ సర్కార్పై నిర్మలా సీతారామన్ భర్త సంచలన వ్యాఖ్యలు
X
మోడీ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ హయాంలోనే నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. కేంద్రంలో ఒక్క ముస్లీం మంత్రి లేడన్న పరకాల.. ఉత్తరప్రదేశ్లోనూ ఒక్క ముస్లీం ఎమ్మెల్యే లేకపోవడం విడ్డూరమన్నారు. దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని.. దేశం అత్యంత సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు.
ఈ దేశం మతం మత్తులో ఊగుతోందని.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ఒకరకమైన భావజాలం పెరిగిపోతుందని పరకాల ఆరోపించారు. దేశం మొత్తం కొందరి చేతుల్లోనే ఉందని విమర్శించారు. ఈ దేశాన్ని ఇంకో పాకిస్థాన్ చేయాలంటే.. గాంధీ, నెహ్రూ, పటేల్లకు రెండు నిమిషాలు పట్టేదికాదని.. కానీ వారు అలా చేయలేదన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని వారు కూడా ఇవాళ దేశ భక్తులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు.
దేశంలోకి చైనా చొరబడినా, శవాలు గంగా నదిలో తేలినా, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలినా, నిరిద్యోగం తాండవిల్లుతున్నా...ఇవేమీ పట్టించుకోకుండా మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామని మండిపడ్డారు. దేశంలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో మోడీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా అని పరకాల ప్రశ్నించారు. దేశంలో 25శాతం మందికి పౌష్టికాహారం దొరకక బలహీనలు అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.