Home > జాతీయం > కూతురి ప్రేమ వివాహం.. బతికుండగానే పిండం పెట్టారు

కూతురి ప్రేమ వివాహం.. బతికుండగానే పిండం పెట్టారు

కూతురి ప్రేమ వివాహం.. బతికుండగానే పిండం పెట్టారు
X

తమ అనుమతి లేకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటను కాదని.. అతడితో వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమకు నచ్చని యువకుడిని పెళ్లాడిన కన్నకూతురు.. చనిపోవడంతో సమానం అని భావించారు. ఈక్రమంలోనే ఆమె ఫొటోకు దండ వేసి కర్మకాండలు జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

ఒడిషాకు చెందిన కేంద్రపాడ జిల్లా ఔల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేమాల్‌ గ్రామానికి చెందిన దీపాంజలి మాలిక్(20) అదే గ్రామానికి చెందిన రాజేంద్ర మాలిక్(23)ను ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెను కుటుంబసభ్యులు మందలించారు. అతడితో ప్రేమ వ్యవహారం మానేయమన్నారు. కానీ నిజమైన ప్రేమ అవేం పట్టించుకోలేదు. గత నెల ఆగష్టు 28న ఇంట్లో వారికి తెలియకుండా రాజేంద్రను ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకుంది. ఆరోజు ఉదయం నుంచి కూతురు కనిపించకపోవడంతో స్థానిక పీఎస్ లో రాజేంద్రపై అనుమానముందని ఫిర్యాదు చేశాడు దీపాంజలి తండ్రి మున్నా మాలిక్. అదే రోజు సాయంత్రానికి పోలీసులు ఆ ఊరి సమీపంలో ఉన్న ఓ గుడిలో దీపాంజలి, రాజేంద్రలు పెళ్లి చేసుకున్నట్లు మున్నాకు తెలిపారు. ఈ విషయం జీర్ణించుకోలేని.. మున్నా కుటుంబ సభ్యులు.. తమ కూతురు చనిపోయిందని ఊరిలో పోస్టర్లు అంటించి మరీ.. శ్రాద్ధకర్మలు జరిపించారు. తమకిష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు.. బతికున్నా చనిపోయినట్లేనని అన్నారు. తమతో సంబంధాలన్నింటినీ తెంచుకుని బయటకెళ్లిన కూతురు శవంతో సమానమని, అందుకే ఆమె అంత్యక్రియలు జరిపామని చెప్పారు.

మరోవైపు.. తాను మేజర్‌నని, ఎవరినీ పెళ్లి చేసుకోవాలో, భర్తగా ఎవరిని ఎంచుకోవాలనే హక్కు తనకు ఉందని చెప్పింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లిదండ్రులు మరొక వ్యక్తితో తన వివాహం జరిపించాలనుకున్నారని... అందుకే తాను రాజేంద్రను వివాహం చేసుకోవాలని సరైన నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అయితే రాజేంద్ర తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని.. దీపాంజలిని తమ కోడలిగా సంతోషంగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై కేంద్రపాడకు చెందిన మానవ హక్కుల కార్యకర్త అమర్‌బరా బిస్వాల్ మాట్లాడుతూ.. దీపాంజలి బతికుండగానే .. ఆమె కుటుంబ సభ్యులకు ఆమె అంత్యక్రియలు చేసే హక్కు లేదని అన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను అవమానించారని, అంత్యక్రియలు నిర్వహించి మానవ హక్కులను ఉల్లంఘించారని బిస్వాల్ అన్నారు. కేంద్రపాడకు చెందిన లాయర్ సుభాష్ దాస్ మాట్లాడుతూ దీపాంజలికి ఆమె తల్లిదండ్రుల ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు ఉందని, ఆమె అంత్యక్రియలు చేయడం ద్వారా వారు ఆమెను వారసురాలు కాదనే హక్కు లేదన్నారు.





Updated : 9 Sep 2023 7:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top