Budget 2024: జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు
X
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓట్ ఆన్ అకౌంట్ (మధ్యంతర) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 31న బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో మహిళా రైతులపై కేంద్రం వరాలు జల్లు కురిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మహిళా రైతులకు ఇచ్చే నగదు సాయాన్ని ఈ బడ్జెట్‌లో రెట్టింపు చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నాయి. ఈ ప్రకటనను ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. కాగా, బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 17వ లోక్‌సభ గడువు జూన్ 16న ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ సమావేశం కావడం ఇదే చివరిసారి. 2019లో మార్చి 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు.