రేపట్నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
X
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు సభ జరగనుంది. పార్లమెంటు పాత బిల్డింగులోనే 17 రోజుల పాటు లోక్ సభ, రాజ్యసభ కొలువుదీరనుంది. ఈసారి కేంద్రం 21 కొత్త బిల్లులు.. 7 పాత బిల్లులను తిరిగి ప్రవేశపెట్టనుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును సైతం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంటు బిల్డింగ్ ఇప్పటికే ప్రారంభించినప్పటికీ కొన్ని పనులు పూర్తికానందున ఈ సారికి పాత బిల్డింగ్ లోనే సభ నిర్వహించాలని నిర్ణయించారు.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2022, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023, జీవ వైవిధ్య (సవరణ) బిల్లు 2021, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2022, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు 2022, మధ్యవర్తిత్వ బిల్లు 2021, రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు 2022, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు 2023, ఢిల్లీలో పాలనా అధికారాల సవరణ బిల్లు వంటి తదితర బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఒకవేళ యూనిఫా సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెడితే దాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపే అవకాశముంది.
ఇదిలా ఉంటే వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా మణిపూర్ హింస, ధరల పెరుగుదలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశముంది. అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ప వచ్చిన లైంగిక ఆరోపణలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, జీఎస్టీని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం తదితర అంశాలపైనా దుమారం చెలరేగే అవకాశముంది. ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో రైల్వే భద్రత అంశాన్ని సభలో లేవనెత్తుతామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది.