లోక్‌సభలో ‘భద్రతా వైఫల్యం’..8 మంది సిబ్బందిపై వేటు
X
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై విపక్ష ఎంపీల నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మోదీ ప్రభుత్వం ఈ అంశంపై వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, లోక్‌సభ సెక్యూరిటీ అంశం సెక్రెటేరియట్ పరిధిలో ఉంటుందని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. అయినా విపక్షాలు శాంతించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు.
బుధవారం లోక్‌సభలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ యువకుడు సభలోకి దూకి షూ నుంచి పసుసు రంగు స్మోక్ తీసి వదిలిన విషయం తెలిసిందే. సదరు యువకుడిని ఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంపై లోక్‌సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సస్పెండ్ అయిన భద్రతా సిబ్బందిలో రాంపాల్, అరవింద్, వీరదాస్, గణేశ్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు.
ఈ ఘటనపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ దాడిని అందరూ ఖండించారని, అవసరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఆరుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా.. ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. అటువైపుగా వెళ్లే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ‘మకర ద్వారం’ నుంచి కేవలం ఎంపీలను మాత్రమే లోనికి అనుమతించారు. మీడియాను కొన్ని మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. పార్లమెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి బూట్లను కూడా నేడు స్కాన్ చేశారు.