Home > జాతీయం > పార్ల‌మెంట్‌లో క‌ల‌ర్ స్మోక్ దాడి.. సూత్రధారి లలిత్ అరెస్ట్

పార్ల‌మెంట్‌లో క‌ల‌ర్ స్మోక్ దాడి.. సూత్రధారి లలిత్ అరెస్ట్

పార్ల‌మెంట్‌లో క‌ల‌ర్ స్మోక్ దాడి..  సూత్రధారి లలిత్ అరెస్ట్
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా అరెస్ట్ అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి లలిత్ ఝా మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పోలీసు ప్రత్యేక బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకొని తిరిగి వచ్చి లొంగిపోయానంటూ లలిత్ తెలిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. లలిత్ ఝా కోల్‌కతా నగరానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తేలింది

మనోరంజన్‌, సాగర్‌ శర్మ, నీలమ్‌, అమోల్‌ శిందె, విశాల్‌, లలిత్‌ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్‌, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్‌, అమోల్‌ శిందే పార్లమెంట్‌ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు.

పార్లమెంట్‌లో నిందితులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా ఈ ఘటనలో నిందితులను ప్రశ్నించేందుకు కోర్టు 1 వారం సమయం ఇచ్చింది.

Updated : 15 Dec 2023 8:43 AM IST
Tags:    
Next Story
Share it
Top