Home > జాతీయం > ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బాధితుల్లో తెలుగువారు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బాధితుల్లో తెలుగువారు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బాధితుల్లో తెలుగువారు
X

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ వాహనం నదిలో పడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గల్లంతయ్యారు. ఉత్తరఖండ్‌లోని తెహ్రీ జిల్లా గులార్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి.. రోడ్లపైకి రాళ్లు పడ్డాయి. దీంతో బండరాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలో పడింది. ప్రమాద సమయంలో ఆ వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణీకులు ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది (Rescue Team) ఐదుగురిని రక్షించింది. ఆచూకీ లేని వారిలో విజయనగరం జిల్లాకు చెందిన జే. రవి రావు ఉన్నారు. అయితే ఆయన భార్య కళ్యాణిని రక్షించి రిషికేశ్ (Rishikesh) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.గల్లంతైనవారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ (Search and Rescue Operation) కొనసాగుతోంది.

కొన్ని రోజులుగా తెహ్రీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పర్వతాల మీద నుంచి బండరాయి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చింది. ఆ బండరాయిని తప్పించే ప్రయత్నంలో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి.. రోడ్డు మీద నుంచి లోయలో ప్రవహించే నదిలో పడిపోయింది. వాహన డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతయ్యారు. సోన్‌ప్రయాగ్ నుంచి రిషికేశ్ తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. మలకుంతి వంతెన నుంచి గులార్ వైపు వెళ్లే సమయంలో వర్షంలో కొండపై నుంచి ఒక్కసారిగా రాయి పడడంతో కారు అదుపుతప్పింది. కారు నేరుగా నదిలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గల్లంతైన వారు అందరూ మృతి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారు గల్లంతై 9 గంటలు అయిందని అధికారులు చెబుతున్నారు. ఐదుగురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది చికిత్స నిమిత్తం వారిని రిషికేశ్ ఆస్పత్రికి తరలించారు.

మరో వైపు భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో అయిన శనివారం యాత్ర నిలిపివేశారు. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని మూసివేయడం వల్ల యాత్రికులకు ప్రయాణానికి అధికారులు అనుమతి నిరాకరించారు. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయిన దృశ్యాలు సోషల్​మీడియాలో వైరల్​అవుతున్నాయి.



Updated : 9 July 2023 11:57 AM IST
Tags:    
Next Story
Share it
Top