Paytm : పేటీఎం కీలక ప్రకటన.. కస్టమర్లకు భరోసా
X
పేటీఎం పేమెంట్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్ల డబ్బులు భద్రంగా ఉన్నాయని తెలిపింది. ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పేటీఎం పేమెంట్ బ్యాంక్ తమ కస్టమర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బులు తమ వద్ద భద్రంగా ఉన్నట్లు ప్రకటించింది. పేటీఎం తమ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఆర్బీఐ గుర్తించింది. నిబంధనలు పాటించకపోవడం వల్ల కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది.
మార్చి నెల నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని, అలాగే నగదు బదిలీ సేవలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్‌ను కూడా నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ తరుణంలో కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 29వ తేది తర్వాత కస్టమర్లు తమ అకౌంట్లు, వాలెట్లలో డబ్బులను జమ చేసేందుకు అనుమతి ఉండదని తెలిపింది. అయితే తమ కస్టమర్లు ఎప్పటిలాగే డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చని వెల్లడించింది. కస్టమర్ల డబ్బులు తమ వద్ద భద్రంగా ఉన్నాయని, సహాయం కోసం తాము 24 గంటలూ కస్టమర్లకు అందుబాటులో ఉంటామని తెలిపింది.
గత కొన్నేళ్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నష్టాలను చవిచూస్తోంది. ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం కంపెనీ షేర్ల విలువ 20 శాతం వరకూ తగ్గిపోయింది. దీనివల్ల మార్కెట్ విలువలో ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ పరిణామం వల్ల పేటీఎం వార్షిక ఆదాయంపై రూ.500 కోట్ల వరకూ నష్టం చూడాల్సి వస్తుందని పేటీఎం అంచనా వేసింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారంగా తక్షణమే చర్యలను మొదలుపెట్టినట్లు పేటీఎం తెలిపింది. తాము త్వరలోనే లాభాలను చూస్తామని, కస్టమర్లు భయపడొద్దని భరోసాను కల్పించింది.