Sabarimala: శబరిమలలో భారీ రద్దీ.. సమస్యలు సాధారణమే అంటున్న మంత్రి
X
శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఒక్క కేరళ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో భక్తులు క్యూ లైన్లలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. కొంతమంది భక్తులు దర్శనం కాకుండానే వెను తిరుగుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం సామాన్యంగా దొరకటం లేదు.
కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు.తమ ఇబ్బందులను పరిష్కరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతున్న భక్తుల రద్దీ దేవస్థానం అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో వసతులు సరిపోవటం లేదు.
ప్రస్తుతం శబరిమల భక్త జనసంద్రంగా మారి, అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగుతుంది. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడంతో తీవ్ర రద్దీ ఏర్పడిందని, ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు.