ప్లీజ్ నన్ను ఈ జైలు నుంచి తీసుకెళ్లండి..పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్
X
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన అటక్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో ఆయనకు కల్పించే వసతులపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్‌ను అత్యంత దారుణమైన సెల్లో ఉంచారని ఈమధ్యనే ఆయన లాయర్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే తనను ఈ జైలు నుంచి తీసుకువెళ్లాలని ఇమ్రాన్ తన లాయర్ నయీమ్ హైదర్‌ను కోరినట్లు తెలుస్తోంది. పగలు, రాత్రిళ్లు కీటకాలు, పురుగులు తనను ఇబ్బంది పెడుతున్నాయని ఈ భయంకరమైన జైలులో అస్సలు ఉండలేనని ఇమ్రాన్ చెప్పినట్లు సమాచారం.
అవినీతి కేసులో దోషిగా తేల్చుతూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలులో ప్రస్తుతం ఇమ్రాన్ తన శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తమ నాయకుడిని అటక్ జైలు నుంచి అదియాల్ కారాగారానికి తరలించాలని పీటీఐ ఇస్లామాబాద్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇమ్రాన్ తరఫున లాయర్స్ టీమ్ జైల్లోనూ పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేసింది. అత్యంత దారుణమైన సెల్లో ఆయన్ని ఖైదీగా ఉంచారని తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇమ్రాన్ తన మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదన్నారు. జైలులో ఎన్ని సంవత్సరాలు ఉంచినా...తాను ఉండేందుకు రెడీ అని తెలిపారని లాయర్ల టీమ్ పేర్కొంది. ఇదిలా ఉండగా తన శిక్షను సస్పెండ్ చేయాలంటూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు నిరాకరించింది. మరో ఐదు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.