MODI : విపక్షాలు నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి : మోదీ
X
కొత్త పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడారు. విపక్షాలు నెగిటివ్గా ఆలోచించడం మానేసి.. పార్లమెంట్లో చర్చకు సహకరించాలని కోరారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఏమైన లోటుపాట్లు ఉంటే.. సందర్శకుల సూచనలతో మార్పులు చేస్తామని చెప్పారు. ఇక ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారినే ప్రజలు గెలిపించారని అన్నారు.
కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 22 వరకు జరగనున్నాయి. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. మహువా బహిష్కరణను సిఫార్సు చేసే నివేదికను సభలో లోక్‌సభ నైతిక కమిటీ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. వీటిని వర్షాకాల సమావేశాల్లోనే కేంద్రం ప్రవేశపెట్టగా.. పరిశీలన కోసం పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపింది. దీనికి సంబంధించిన రిపోర్టులు హోంమంత్రిత్వ శాఖకు అందగా.. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమావేశాల్లో ఈ బిల్లులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.