Modi Parliament Ppeech : తెలంగాణ హక్కులను కాలరాసే కుట్రలు జరిగాయి : మోదీ
X
యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగ్గా జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఆయన ప్రసంగించారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ.. పాత భవనంతో జ్ఞాపకాలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ విభజనను సభలో మోదీ ప్రస్తావించారు. ఈ భవనంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. ఎన్నో వ్యయప్రయాసల మధ్య తెలంగాణ ఏర్పాటైందని.. తెలంగాణ కోసం రక్తం ఏరులై పారిందని గుర్తుచేశారు.
తెలంగాణ హక్కులను కాలరాసే కుట్రలు జరిగాయని మోదీ అన్నారు. ‘‘ఏపీ విభజన తీరుపై ఇరు రాష్ట్రాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.రెండు రాష్ట్రాల్లోనూ సంబరాలను సరిగ్గా జరుపుకోలేదు. వాజ్పెయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగింది. అప్పుడు విడిపోయిన రాష్ట్రాలు సంబరాలు చేసుకున్నారు’’ అని మోదీ అన్నారు. ఇక జీఎస్టీతో పాటు ఎన్నో కీలక తీర్మానాలు ఈ భవనంలోనే చేశామని గుర్తు చేసుకున్నారు. భారత అభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం కన్పిస్తుందని వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి వాజ్పెయి, మన్మోహన్ వరకు ఈ సభకు నాయకత్వం వహించారని.. ప్రధానులుగా ఉన్నప్పుడే నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీ, ఇందిరా గాంధీ దివంగతులయ్యారని అన్నారు.
1927 జనవరి 18న ఈ పార్లమెంట్ భవనం ప్రారంభమైనట్లు మోదీ చెప్పారు. గత 75 ఏళ్లలో 7500 ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారన్నారు. భారత్ నిర్మాణాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలన్నారు. పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రజలు చెమటోడ్చి కట్టారని తెలిపారు. రైల్వే ఫ్లాట్ ఫాం నుంచి వచ్చిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడని అన్నారు. ఈ భవనం ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైందని.. ఈ సభలో ఎన్నోసార్లు ఎన్నో భావొద్వేగాలు పంచుకున్నామని చెప్పారు. ఈ భవనంలో నెహ్రూ, అంబేద్కర్ నడిచారని చెప్పారు.