Home > జాతీయం > IndependenceDay: 2024 ఎర్రకోట ప్రసంగంలో చెప్తా.. మోదీది ఆత్మవిశ్వాసమా? అహంకారమా?

IndependenceDay: 2024 ఎర్రకోట ప్రసంగంలో చెప్తా.. మోదీది ఆత్మవిశ్వాసమా? అహంకారమా?

IndependenceDay: 2024 ఎర్రకోట ప్రసంగంలో చెప్తా.. మోదీది ఆత్మవిశ్వాసమా? అహంకారమా?
X

ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా రాజకీయ రణభేరి మోగించారు. పంద్రాగస్టున సాగే ఆనవాయితీలను పక్కకు తప్పించి ఆత్మస్తుతి, పరనిందను తారస్థాయికి తీసుకెళ్లారు. ‘‘దేశం సాధించిన విజయాల గురించి వచ్చే ఆగస్ట్ 15న ఎర్రకోటమీద నుంచే చెబుతాను’’ అని సంచలన ప్రకటన చేశారు. 77 ఏళ్ల ఎర్రకోట ప్రసంగాల్లో ఇలాంటి రాజకీయ ప్రకటన చేసిన తొలి ప్రధానిగా నిలిచిపోయారు.

దేశం వెనకబాటుతనానికి వారసత్వ రాజకీయాలు, అవినీతే ప్రధాన కారణమంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ మరో అడుగు ముందుకేసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం తనదేనని ధీమాగా చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపరుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించుకుని, దేశ సమైక్యతను, స్వాతంత్ర్య దీప్తిని చాటి చెప్పే కార్యక్రమంలో మోదీ ఇలా మాట్లాడడం అహంకారమనేనని విమర్శలు వస్తున్నాయి. అది మోదీ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించాలని, దేశ విజయాలను చాటే ఉద్వేగంలో ఆయన అలా మాట్లాడి ఉంటారని మరో వాదన వినిపిస్తోంది.

అందుకేనా ఆ ధీమా?

వచ్చే ఎన్నికల్లో తమకు 350 సీట్లకుపైగా వస్తాయని బీజేపీ నేతలు తరచూ చెబుతున్నారు. ఎవరి మద్దతూ లేకుండా మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన పలు సర్వే ఫలితాలు బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పాయి. టీవీ సీఎన్ఎక్స్ తాజా తాజా సర్వేలో బీజేపీ ఒంటిచేత్తోనే 290 సీట్లు, కాంగ్రెస్ 66 సీట్లు సాధిస్తాయని వెల్లడించింది. పలు సర్వేల్లోనూ సింహభాగం సీట్లు కాషాయ కూటమికే వెళ్తున్నాయి. సర్వేలతోపాటు, ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి తమవైపే వీస్తోందనే ధీమాతోనే మోదీ 2024 ఎర్రకోట ప్రసంగాన్ని ముందస్తుగా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి 303, కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపబోదని కమలనాథుల ధీమా.

తేడా వస్తే...

మరోపక్క ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్షల మధ్య ఐక్యత ఉండదని మోదీ భావిస్తున్నారు. నితీశ్ కుమార్, కుమారస్వామి వంటి చాలామంది విపక్షాల నేతలు గోడమీద పిల్లులని ఆయన భావన. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాకపోయినా నితీశ్, జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రాంతీ యపార్టీల మద్దతు ఉంటుంది కనుక వచ్చే సర్కారు తనదేనని మోదీ ఆలోచనగా కనిపిస్తోంది. వీటికి తోడు దేశభక్తి, హిందూత్వ రాజకీయాలతో ఓట్లు భారీగా పోలరైజ్ అవుతాయని, విజయం తథ్యమని భావిస్తున్నట్లు 77వ పంద్రాగస్టు ప్రసంగం చెబుతోంది. దేశ విజయాలను అటుతిప్పి ఇటుతిప్పి బీజేపీ ఖాతాలో వేసిన మోదీ పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.

Updated : 15 Aug 2023 6:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top