Prakash Raj : రేవంత్కు సిగ్గులేదు.. యువతతో కూరగాయలు అమ్మిస్తానంటాడా: ప్రకాశ్ రాజ్
X
తెలంగాణ రాజకీయల్లో జరుగుతున్న పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీజేపీకి సౌత్ ఇండియాలో అసలు ఓటు బ్యాంకు లేదని, తెలంగాణలో గ్రౌండ్ రియాలిటీ చూసుకుని మాట్లాడాలన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎన్ని డిపాజిట్లు కోల్పోయిందో గుర్తుచేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని ఫైర్ అయ్యారు. ఓ బాధ్యతగల నేతగా పార్టీని ముందుకు నడిపించాల్సింది పోయి, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. పార్టీ అధికారంలోకి తీసుకొస్తే యువతతో కూరగాయలు అమ్మిస్తారా..? రేవంత్ రెడ్డిది ఇదేం విజన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ఉన్న అతి గొప్ప నటుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. మోదీకోసం కాస్ట్యూమ్, మేకప్, హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్స్ పని చేస్తున్నాయని చెప్పారు. అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకున్నాకే ప్రజల ముందుకు వచ్చి తన నటనతో రాజకీయం చేస్తారని విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవనంలో హోమం చేయడంపై ప్రకాశ్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ప్రధాని చేయాల్సి పనికాదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పీఎం మెటీరియల్ అని కొనియాడారు. కేసీఆర్ ను బాగా అర్థం చేసుకోవాలని, ఆయన గొప్ప విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.