Home > జాతీయం > జీ -20లో కీలక పరిణామం.. శాశ్వత సభ్యదేశంగా ఆఫ్రియన్ యూనియన్

జీ -20లో కీలక పరిణామం.. శాశ్వత సభ్యదేశంగా ఆఫ్రియన్ యూనియన్

జీ -20లో కీలక పరిణామం.. శాశ్వత సభ్యదేశంగా ఆఫ్రియన్ యూనియన్
X

ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ - 20 సమ్మిట్లో కీలక పరిణామం చోటు చేసుకొంది. జీ - 20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తూ ప్రకటన చేశారు. భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం తెలపడంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను పర్మినెంట్ మెంబర్స్కు అలాట్ చేసిన కుర్చీలో కూర్చోబెట్టారు.

వన్ ఎర్త్ సెషన్ లో భాగంగా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ తొలుత మొరాకో భూకంప మృతులకు సంతాపం తెలిపారు. ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలని కోరారు. బాధితులకు అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అనంతరం జీ 20 సదస్సుకు హాజరైన వారందరికీ అధ్యక్ష హోదాలో మోడీ స్వాగతం పలికారు. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయన్న ఆయన.. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయని చెప్పారు. కాలానికి అనుగుణంగా ప్రస్తుతం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడగా.. యుద్ధం అపనమ్మకాన్ని మరింత పెంచిందని మోడీ అన్నారు. కొవిడ్‌ను ఓడించినట్లే విశ్వాసరాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చని చెప్పారు. ఇందులో సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మార్గదర్శిగా ఉపయోగపడుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత తదితర సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ కూర్చున్న స్థానంలో దేశం పేరును ‘ఇండియా’కు బదులు ‘భారత్‌’ అని రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated : 9 Sept 2023 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top