ముగిసిన అమెరికా పర్యటన..ఈజిప్టుకు ప్రధాని మోదీ
X
ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజుల పాటు ఆయన యూఎస్ లో పర్యటించారు. తొలిరోజు ఐక్యరాజ్యసమితిలో జరిగిన యోగా డేలో పాల్గొన్నారు. ఆ తర్వాత రోజు ప్రెసిడెంట్ బైడెన్ తో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించారు. ఆ తర్వాత రోజు వివిధ కంపెనీల సీఈవోలు, వ్యాపారస్థులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు.
మోడీకి అమెరికాలో ఘనస్వాగతం లభించింది. వెళ్లిన ప్రతిచోట ప్రధానిని కలిసేందుకు అమెరికన్లు పోటీ పడ్డారు. యూఎస్ ప్రముఖులు సైతం మోడీని కలిసేందుకు ఉత్సాహం చూపించడం గమనార్హం. విజయవంతంగా అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ.. ఈజిప్ట్ వెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు.
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతహ్ అల్ సిసితో మోదీ భేటీ అవుతారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం 11వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రక అల్ హకీమ్ మసీదును సందర్శిస్తారు. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులర్పిస్తారు. కాగా ప్రధాని అయ్యాక మోడీ ఈజిప్ట్లో పర్యటించడం ఇదే తొలిసారి.