నవతరానికి చందమామపై కొత్త కథలు చెప్పొచ్చు : మోదీ
X
జాబిల్లిపై ఇండియా సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచంలో ఏ దేశం చేరుకోలేని చంద్రుడి దక్షణ ధృవాని చంద్రయాన్-3 చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా వీక్షించిన ఆయన ప్రయోగం విజయవంతం అయిన వెంటనే మువ్వన్నెల జెండా ఊపి హర్షం వ్యక్తం చేశారు.
చంద్రయాన్ 3 విజయంతో తన జీవితం ధన్యమైందని మోదీ అన్నారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయం అని చెప్పారు. ఇకపై నవతరానికి చందమామపై కొత్త కథలు చెప్పొచ్చు అన్నారు. అజాదీ కా అమృతకాలంలో ఇది తొలి విజయమన్నారు. ‘‘అంతరిక్షంలో కొత్త చరిత్రను సృష్టించాం. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. నేను బ్రిక్స్ సదస్సులో ఉన్నా మనసంతా చంద్రయాన్ పైనే ఉంది. సౌరమండలంపై కూడా ప్రయోగాలు చేస్తాం. మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేపడతాం’’ అని మోదీ చెప్పారు.