అయోధ్య ఆలయంపై పోస్టల్ స్టాంప్‌లు.. విడుదల చేసిన మోదీ
X
అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామమందిర ప్రారంభోత్సవ క్రతువులతో ఆ ప్రాంతమంతా రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఈ నెల 22న అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీనికి సంబంధించి ఇవాళ్టి నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామమందిరంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్‌రాజ్, శబరిమాతపై ఆరు స్టాంప్‌లను మోదీ రిలీజ్ చేశారు.
అయోధ్య ఆలయ ఆకృతి, ఆలయ ఆవరణలోని కళాఖండాలు, సూర్యుడు, సరయూ నదిని ప్రతిబింబించేలా ఈ స్టాంపులను డిజైన్ చేశారు. దీనిపై ‘మంగళ్ భవన్ అమంగళ్ హరి’ అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా రాముడిపై విడుదలైన స్టాంపులతో 48 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ఈ బుక్ లో అమెరికా, న్యూజిలాండ్, కెనడా, సింగాపూర్ వంటి 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులు ఉన్నాయి.
కాగా రామ మందిర ప్రారంభం, ప్రాణ ప్రతిష్ఠ కోసం జనవరి 22ను ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 22 పౌష్య మాసంలోని శుక్లపక్ష ద్వాదశి. ఆ రోజున ఉదయం 8.47 గంటల నుంచి మృగశిర నక్షత్రం, యోగ ఇంద్రయోగం ప్రారంభమవుతుంది. అదే రోజున కర్మ ద్వాదశి కూడా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం కర్మ ద్వాదశి రోజున సాగర మథనం కోసం విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందుకే విష్ణు మూర్తి ఏడో రూపమైన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అదే రోజున జరపాలని నిర్ణయించారు. జనవరి 22 మధ్యాహ్నం 12.29గంటల నుంచి 12.30 గంటల మధ్య 84 సెకండ్ల వ్యవధిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ తర్వాత మహాపూజ, మహాహారతి నిర్వహిస్తారు