ఒకేసారి 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం
X
దేశవ్యాప్తంగా ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులకు మోదీ శ్రీకారం చుట్టున్నారు. దీంతో రైల్వేస్టేషన్లన్నీ కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ వీటికి శంకుస్థాపన చేస్తారు. అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టగా.. ఇందుకు రూ.24,470 కోట్లను ఖర్చు చేయనుంది. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఈ 508 స్టేషన్లును ఎంపిక చేశారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 స్టేషన్‌ల పునరాభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో 21 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 15 స్టేషన్లు, మహారాష్ట్రలో 13 స్టేషన్లు, కర్ణాటకలో 1 స్టేషన్ను ఆధునికరించనున్నారు. తెలంగాణలో కాజీపేట జంక్షన్, జనగామ రైల్వే స్టేషన్, మహబూబాబాద్ స్టేషన్, నాంపల్లి, మలక్‌పేట్, మల్కాజిగిరి, హైటెక్ సిటీ సహా పలు స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
రైల్వే స్టేషన్ క్లీన్గా ఉండేలా చూడడంతోపాటు ప్రయాణీకులు వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో సహా రైల్వేస్టేషన్ కేంద్రంగా నగరాభివృద్ధి జరుగుతుందని కేంద్రం చెప్పింది. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు ప్రధాని కార్యాలయం వివరించింది.