మోదీ అరుదైన రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా...
X
ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. పంద్రాగస్టున ఎర్రకోటపై నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. ఆయన మంగళవారం 77వ స్వాతంత్ర్య దినాన్ని పురస్కరించుకుని లాల్ ఖిల్లాపై నుంచి మువ్వన్నెల జెండాను ఎగరేశారు. దీంతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు ముగిశాయి. దేశప్రధానిగా వరుసగా 10 సార్లు జెండాను ఆవిష్కరించిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఉండేది. మోదీ ఆ రికార్డును సమం చేశారు. దేశం ఇంతవరకు 15 మంది ప్రధానులను చూడగా వారిలో ఇద్దరు.. గుల్జారీ లాల్ నందా, చంద్రశేఖర్‌లకు ఎర్రకోటపై జెండా ఎగరేసే అవకాశం రాలేదు.
కాగా, మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు దేశం నలుమూలల నుంచి 1800 మంది అతిథులు హాజరయ్యారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళుల్పించారు. పతాకావిష్కరణ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయనకు ఇదే చివరి ఎర్రకోట ప్రసంగం. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ప్రధాని ట్విటర్లోనూ పంద్రాగస్ట్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు ఘన నివాళి అర్పిస్తున్నారు. వారు కన్న కలలను నిజం చేయడానికి మనవంతుగా నిబద్ధతతో కలిసి కృషి చేద్దాం. జై హింద’’ అని ట్వీట్ చేశారు.