శంకరాచార్యులకు మోదీ కౌంటర్! .. నాకే అర్హత లేదంటావా?
X
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మూహూర్తం దగ్గర పడింది. రాజకీయాలతో ముడిపడిన అంశం కావడంతో వివాదాలు కూడా మొదలవుతున్నాయి. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాగనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరు కావడం లేదు. పలువురు ప్రముఖ సాధువులు కూడా దూరంగా ఉంటున్నారు. మోదీకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అర్హత లేదని కొందరు సాధువులు విమర్శిస్తున్నారు. రాముడి విగ్రహాన్ని తాకే అర్హత మోదీకి లేదని తనలాంటి సాధువులే ఆ పని చేయాలని పూరి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని తనను, తన సహాయకుణ్ని మాత్రమే ఆహ్వనించారని, తమ పీఠంలోని ఇతర సాధుసంతులను అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వానితుల సంఖ్యపై పరిమితి విధించడం సరికాదని, తను అయోధ్యకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. మోదీ చేతులతో ఈ కార్యక్రమం సాగడం సరికాదని, భార్య ఉన్నవాళ్లే ఇలాంటి కార్యక్రమం జరపాలని మరికొందరు అంటున్నారు.
మరోపక్క.. రామాలయ ప్రారంభోత్సవం బీజేపీ, ఆరెస్సెస్ తంతులా మారిందంటూ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితర నేతలు వెళ్లడం లేదు. ఈ విమర్శలు మోదీకి ఇబ్బందిగా మారాయి. కోట్లాది హిందువులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేడుకకు మరింత రాజకీయ రంగు పడకుండా ఆయన అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాముడి విగ్రహాన్ని తాకే అర్హత తనకు లేదని నిశ్చలానంద సరస్వతి చేసిన విమర్శలను తీవ్రంగా తీసుకున్నట్లు కరిపిస్తోంది. దేశం కోసం, ధర్మం కోసం సంసారాన్ని త్యజించానని చెబుతున్న మోదీ తను హిందుత్వ రాజకీయాలకు ప్రతినిధినని భావించుకుంటారు. అయోధ్యలో రాముడి ప్రతిష్ట ఆయన పరువు ప్రతిష్టలకు సంబంధించినది. దానికి తను అన్ని విధాలా అర్హుణ్నే అని చాటి, విమర్శలకు చెక్ పెట్టడానికి 'దీక్ష'కు ఉపక్రమించారు.
11 రోజులపాటు తను అనుష్టాన దీక్షను పాటిస్తున్నట్లు మోదీ తర యూట్యూబ్ చానల్లో ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు అర్హత లేదనే విమర్శలకు దీక్షే సమాధానమని ఆయన పరోక్షంగా చెప్పేశారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం తనకు దక్కడం అదృష్టమని మోదీ అన్నారు. ''వేడుకలో భారతీయులకు నన్ను ప్రాతినిధ్యం వహించాలని భగవంతుడు నన్ను కోరాడు. అందుకే 11 రోజుల ప్రత్యేక అనుష్టానాన్ని ప్రారంభిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలను కోరుతున్నాను'' అని మోదీ అన్నారు.
ప్రాణప్రతిష్ట చాలా విస్తృతమైన కార్యక్రమం. దీన్ని నిర్వహించే ముందు ఎన్నో పూజలు చేయాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మోదీ దీక్షకు పూనుకున్నారు. ఆయన 11 రోజుల పాటు బ్రాహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, ప్రార్థన చేస్తారు. కొద్దిగా ఆహారం మాత్రమే పుచ్చుకుంటారు. శాస్త్రాలు నిర్దేశించినట్లు ఉపవాస దీక్షలు చేస్తారు. సంప్రదాయబద్ధంగా దీక్ష పూర్తి చేసే అయోధ్యకు వెళ్తారు. 22న అయోధ్య మందిరంలోని పూజా మండపం నుంచి 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని మోసుకెళ్లి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు.
మరోవైపు.. రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్టు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తోంది. టెంట్లను ఏర్పాటు చేసి రోజూ 15 వేలమందికి వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోంది. ప్రారంభోత్సవానిక 4 వేల మంది సాధువులు హాజరు కానున్నారు. 16వ నుంచి ఉత్సావాలు ప్రారంభం కానున్నాయి. కాశీకి చెందిన ప్రఖ్యాత వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో రామప్రతిష్ట జరుగుతుంది.