MODI : నేడు అయోధ్యకు పీఎం మోడీ.. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ప్రారంభం
X
అయోధ్యలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన పర్యటన సాగనుంది. దాదాపు రూ.15,700కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సైతం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు.
అయోధ్యలో దాదాపు రూ.1,450 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించారు. 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ బిల్డింగ్ నిర్మించారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్యధామం’ అనే పేరు పెట్టారు. గతంలో మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించేవారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ, ముంబై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ తదితర నగరాలకు విమానాలు నడపనున్నారు. జనవరి 6నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఇక ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’ అని నామకరణం చేశారు. అయోధ్య రైల్వే స్టేషన్ లో శ్రీరాముడి స్ఫూర్తి ప్రతిబింబించేలా పలు కట్టడాలు నిర్మించారు. నాలుగు ఎత్తైన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టేషన్ విస్తరించి ఉంది. రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ ఈ స్టేషన్ డెవలప్ చేసింది.