రాజ్యాంగంపై ప్రధాని సలహాదారు సంచలన వ్యాఖ్యలు
X
దేశ రాజ్యాంగంపై ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 70 ఏళ్లు దాటిపోయిన రాజ్యాంగాన్నా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరముందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పత్రికలో ఈ అంశంపై రాసిన వ్యాసంలో పలు సునిశిత వ్యాఖ్యలు చేశారు. 1950ల నాటి రాజ్యాంగంలో మన కొనసాగలేని పరిస్థితి నెలకొందని, అందుకే ఎన్నోసవరణలు చేసుకున్నామని వ్యాఖ్యానించారు.
‘‘రాజ్యంగాన్ని నిత్యం గమనిస్తుండాలని అంబేద్కర్ కూడా అన్నారు. దాని మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని 1973లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఆ రాజ్యాంగం వలస వారసత్వం నుంచి వచ్చింది. మనకు కొత్త రాజ్యాంగం కావాలి. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. రాజ్యాంగ ప్రవేశికలో చెప్పుకున్న పదాలకు అసలు అర్థమేమటని ఆలోచించాలి’’ అని బిబేక్ రాశారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. వివాదంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి స్పందించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పింది. తను కేవలం వ్యక్తిగత స్థాయిలో రాజ్యంగం గురించి రాశానని, మండలికి సంబంధం లేని బిబేక్ కూడా విరణ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మొత్తం పక్కన పడేయాలని అనలేదని చెప్పుకొచ్చారు.