Home > జాతీయం > దారుణం.. ఆ మహిళల్ని వాళ్లకు అప్పజెప్పింది పోలీసులే..!

దారుణం.. ఆ మహిళల్ని వాళ్లకు అప్పజెప్పింది పోలీసులే..!

దారుణం.. ఆ మహిళల్ని వాళ్లకు అప్పజెప్పింది పోలీసులే..!
X

జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ రావణకాష్టంలా రగులుతోంది. తాజాగా వెలుగుచూసిన మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి దారుణ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రక్షించాల్సిన పోలీసులే సదరు మహిళల పట్ల అమానవీయంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పోలీసులే స్వయంగా బాధితుల్ని ఆందోళనకారులకు అప్పజెప్పినట్లు వెలుగులోకి వచ్చింది.

సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా

మణిపూర్‌లో మే 3న రెండు తెగల మధ్య చెలరేగిన హింసతో రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా ఉలిక్కిపడింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. ఈ క్రమంలోనే తమ ఊరిపైనా దాడి జరిగే అవకాశముందన్న అనుమానంతో మే 4వ తేదీన బీ.ఫయనోమ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21), మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు.

ఐదుగురిని అడ్డగించి

ఐదుగురు బాధితులు నాంగ్‌పోక్‌ సెక్‌మై వద్ద పోలీసులు కనిపించడంతో వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు 800 నుంచి వెయ్యి మంది జనం.. బీ.ఫయనోమ్‌ గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురిని అడ్డగించింది. అనంతరం పోలీసుల వద్ద నిలబడి ఉన్న వారిపై దాడికి పాల్పడింది. 19ఏండ్ల యువకుడు తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించడంతో మూక దాడిలో అతడితో పాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం యువతితో పాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు మే 21న కేసును నాంగ్‌పాక్‌ సెక్‌మై పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

పోలీసులే అప్పగించారు..

ఎఫ్ఐఆర్లో ఇలా ఉంటే బాధితుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. పోలీసులే స్వయంగా అల్లరి మూకకు తమను అప్పజెప్పారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంపై దాడికి వచ్చిన అల్లరి మూకకు పోలీసులు కూడా సహకరించారని వారు అంటున్నారు. వాహనంలో తమను ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు ఊరి నుంచి కొంచెం దూరం వెళ్లాక అల్లరి మూకలు ఉన్న ప్రాంతంలో తమను రోడ్డుపై వదిలేయడంతోనే ఈ దారుణం జరిగిందని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమను స్వయంగా పోలీసులే వారికి అప్పజెప్పారని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో బాధిత యువతి చెప్పింది. తమపై దాడి చేసిన మూకలో చాలా మంది ఉన్నారని అయితే వారిలో కొందరిని గుర్తుపడతానని, నిందితుల్లో ఒకరు తన తమ్ముడి ఫ్రెండ్ కూడా ఉన్నాడని బాధిత యువతి చెబుతోంది. మణిపూర్ లో ఇంటర్నెట్ బంద్ చేసినందున వైరల్ గా మారిన వీడియో గురించి తమకు తెలియదని అంటోంది.

Updated : 20 July 2023 8:25 PM IST
Tags:    
Next Story
Share it
Top