Home > జాతీయం > గర్బిణుల రిక్వెస్ట్.. డాక్టర్లకు కొత్త తలనొప్పి..

గర్బిణుల రిక్వెస్ట్.. డాక్టర్లకు కొత్త తలనొప్పి..

గర్బిణుల రిక్వెస్ట్.. డాక్టర్లకు కొత్త తలనొప్పి..
X

రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. చారిత్రాత్మకమైన ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మలుచుకోవాలని చాలా మంది గర్బిణులు భావిస్తున్నారు. ఆ రోజునే సిజేరియన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే సదరు మహిళల కోరిక హాస్పిటళ్లు, డాక్టర్లపై ఒత్తిడి పెంచుతోంది.

జనవరి 22న సిజేరియన్ సెక్షన్ కాన్పు చేయాలంటూ అయోధ్యలోని జిల్లా ఆస్పత్రికి గర్బిణులు క్యూ కట్టారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు తమకు కాన్పు చేయాలని పదుల సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వారి కోరిక విని ఆశ్చర్యపోతున్నామని అంటున్నారు. అయోధ్యలోని జిల్లా ఆస్పత్రిలో 100 పడకల ఆస్పత్రి ఉండగా.. నిత్యం 150 నుంచి 200 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వారిలో చాలా వరకు గర్భిణులే ఉంటారు. హాస్పిటల్లో సగటున రోజుకు 6 నుంచి 8 కాన్పులు జరుగుతాయి. కానీ జనవరి 22న కాన్పు చేయాలంటూ ఇప్పటికే చాలా మంది వస్తున్నారని డాక్టర్లు వాపోతున్నారు.

కేవలం అయోధ్యలోనే కాదు.. యూపీలోని పలు ఆస్పత్రుల వైద్యులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. కాన్పూర్ ఆస్పత్రిలో సాధారణంగా రోజుకు 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. జనవరి 22న సిజేరియన్‌ ఆపరేషన్లు చేయాలని ఇప్పటికే 12 నుంచి 14 లిఖితపూర్వక వినతులు ఇచ్చారని, వారి అభ్యర్థన మేరకు 35 ఆపరేషన్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్పూర్ మెడికల్ కాలేజ్ గైనకాలజీ ఇంఛార్జ్ డాక్టర్ సీమా ద్వివేదీ చెప్పారు.

ఇదిలా ఉంటే జనవరి 22న కాన్పు చేయాలని గర్బిణులు, వారి కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తుండటాన్ని డాక్టర్లు తప్పుబడుతున్నారు. నెలలు నిండకముందే కాన్పులు చేయాలనడం సరికాదని అంటున్నారు. శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు బిడ్డ పుడితే అంతా శుభమేకలుగుతుందన్న విశ్వాసంతో ఇలా సిజేరియన్ డెలవరీలకు డిమాండ్ చేస్తే తల్లీ బిడ్డా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Updated : 8 Jan 2024 7:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top