మహిళా బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి
X
మహిళా రిజర్వేషన్ బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆమోదంతో చట్టసభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్19న లోక్‌సభలో , సెప్టెంబర్ 21 రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. లోక్‌సభ , రాజ్యసభలు మహిళా బిల్లును ఆమోదించాయి. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోదం తెలపడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. చారిత్రాత్మక విజయంగా నిలిచింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిది కాదు. 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ మొదటిసారిగా లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 2010లో మహిళా బిల్లుపే రాజ్యసభ ఆమోదించినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. ఆ తర్వాత 2014లో లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు అక్కడే మురిగిపోయింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంట్లో ఈ చారిత్రాత్మక బిల్లును తీసుకొచ్చారు. ఉభయసభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఆమోదించారు.