President of India : చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగింది: రాష్ట్రపతి
X
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి.. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరెలను తయారీని పరిశీలించారు. స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా , పోచంపల్లి చేనేత వస్త్రాలకు సంబంధించిన విశేషాలకు సంబంధించిన స్టాల్స్ ను సందర్శించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభా వేదికపైకి వచ్చి స్థానికుల చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల తయారీలో భౌగోళిక గుర్తింపు రావడం సంతోషం అన్నారు. చేనేత వస్త్రాల తయారీలో కొత్త వరవడిని సృష్టించడాన్ని అభినందించారు. సోలార్ శక్తిని ఉపయోగించి వస్త్రాల తయారీ చేయడం సంతోషించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. పోచంపల్లి చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందన్నారు రాష్ట్రపతి. చేనేత కళ విభిన్నమైనదని, చేనేత కళను భావితరాలకు అందించడం చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలోనూ పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
పోచంపల్లి గ్రామీణుల చేనేత కార్మికుల జీవన విధానాన్ని పరిశీలించానని, తాను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన దానిని కాబట్టి .. తమ ప్రాంతంలో కూడా చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దానికి అనుగుణంగా దేశ విదేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల లాగే తమ ప్రాంతం నుండి కూడా కొందరిని ఇక్కడికి తీసుకువచ్చి చేనేత పరిశ్రమ గురించి వారికి తెలియజేసి ఈ పరిశ్రమను అక్కడ కూడా నెలకొల్పడానికి ప్రయత్నిస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు అవార్డ్ గ్రహీతలు రాష్ట్రపతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు,సీతక్క స్థానిక నాయకులు పాల్గొన్నారు.