President Droupadi Murmu: రామమందిరం ప్రారంభోత్సవం వేళ.. ప్రధానికి లేఖ రాసిన భారత రాష్ట్రపతి
X
అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ వేళ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రామాలయంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రభు శ్రీరాముడు బోధించిన ధైర్యం, పనిపై ఏకాగ్రత, కరుణ వంటి గుణాలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానికి రాసిన లేఖను ద్రౌపది ముర్ము తన అధికారిక ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశారు. "సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన ఉత్తమ అంశాలను శ్రీరామ ప్రభువు సూచిస్తారు. అన్నింటికంటే మించి చెడుతో నిరంతర పోరాటం ద్వారా మంచిని సూచిస్తాడు. రాముడి జీవితం, ఆయన పాటించిన సూత్రాలు దేశ చరిత్రలోని అనేక అంశాలను ప్రభావితం చేయటం సహా దేశ నిర్మాతలను ప్రేరేపించాయి" అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన లేఖలో పేర్కొన్నారు.
President Droupadi Murmu writes to Prime Minister Shri @narendramodi on the eve of Pran Pratishtha at Shri Ram Mandir in Ayodhya Dham. pic.twitter.com/r6sXXmdanT
— President of India (@rashtrapatibhvn) January 21, 2024
రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం గత 11 రోజులుగా ప్రధాని మోడీ పాటిస్తున్న నిష్ట గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మీరు చేపట్టిన 11 రోజుల అనుష్ఠానం ఒక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదు.. ప్రభు శ్రీరాముడి పట్ల మీ త్యాగనిరతికి, సమర్పణకు అద్దంపట్టే అత్యున్నత ఆధ్యాత్మిక చర్య’’ అని భారత రాష్ట్రపతి కొనియాడారు. భారత జాతిపిత మహాత్మా గాంధీజీ తుదిశ్వాస వరకు కూడా రామనామంతోనే శక్తిని పొందారని చెప్పారు. ‘‘రామనామమే సత్యం. ఎన్నో చీకటి సమయాల్లో, కష్ట కాలాల్లో ఆ రామనామమే నన్ను రక్షించింది. ఇప్పటికీ నన్ను రక్షిస్తోంది’’ అని గాంధీజీ చెప్పేవారన్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘోర అవమానం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు దేశ, విదేశ ప్రముఖులను ఆహ్వానించిన కేంద్రప్రభుత్వం.. రాష్ట్రపతిని మాత్రం ఆహ్వానించలేదని.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్ర నాయకులపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఆనాడు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమంలోనూ.. ఈనాడు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడానూ రాష్ట్రపతిని ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. దేశ ప్రథమ పౌరురాలిని అవమానించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.