MODI : ప్రపంచంలోనే తొలిక్లాక్.. 'వేద గడియారం' ప్రారంభించనున్న మోడీ
X
ప్రపంచంలోనే తొలిసారి వేదగడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో నేడు విక్రమాదిత్య వేద గడియారాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ క్లాక్‌ను తొలిసారా వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారంగా కాల గణన పద్దతిలో ఆ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలో జంతర్ మంతర్ ఏరియా వద్ద 85 అడుగుల టవర్‌పై వేద గడియారాన్ని అమర్చారు.
వేదగడియారం హిందూ పంచాంగ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు, అంచనాలకు సంబంధించి సమాచారాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా భారత ప్రామాణిక కాలం, జీఎంటీలను కూడా గడియారం చెబుతుంది. గడియారంలో సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభ గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి వివరాలను చూసుకోవచ్చు. సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకూ ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది.
ఈ గడియారం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని అధికారులు తెలిపారు. వేద హిందూ పంచాగ సమాచారాన్ని తెలిపే తొలి గడియారం ఇదేనని స్పష్టం చేశారు. ఉజ్జయిని నుంచి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తూ ఉంటుందని, భారత కాల గణన సంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా మళ్లీ తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఈ వేదగడియారం గురించి భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశామన్నారు.