Prisoner-turned-teacher: సంకెళ్లతోనే అపాయింట్‌మెంట్ లెటర్.. చేసిన నేరమేంటంటే
X
జైల్లో ఖైదీగా కాలం గడుపుతున్న ఓ వ్యక్తి... జైల్లోనే బీపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమై.. ఉద్యోగం కూడా సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కోర్టు అతనికి కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అనుమతిని కూడా ఇవ్వడంతో.. అధికారులు అతనికి అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందించారు. బిహార్‌లోని నలందా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
రాజ్ కిషోర్ చౌదరి అనే యువకుడిపై గృహ వివాదాల ఆరోపణలపై కొన్ని నెలల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా అతడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే కొన్ని నెలల క్రితం బిహార్ ప్రభుత్వం బీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. జైలులో ఉన్నప్పుడే అతడు ఈ పరీక్షకు హాజరవ్వగా ఉత్తీర్ణత సాధించాడు. తియూరి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా అతడికి పోస్టింగ్ ఇచ్చింది. అయితే బిహార్ షరీఫ్ బిహేవియరల్ కోర్టు రాజ్‌కిషోర్ ఉపాధ్యాయ నియమాక పరీక్షా ఫలితాలను పరిశీలించింది. కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు రాజ్ కిషోర్‌ను అనుమతించింది. అతడికి అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందించమని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజ్ కిషోర్‌ను సంకెళ్లు వేసి డీఈవో కార్యాలయానికి తీసుకెళ్లారు జైలు అధికారులు.
అప్పుడు అక్కడ ఉన్న అధికారులతో పాటు అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారితో ప్లానింగ్ ఇన్ఛార్జ్ సుమిత్ కుమార్, మరో ఇన్ఛార్జ్ అమిత్ కుమార్ మిశ్రా ఫోన్లో మాట్లాడారు. అనంతరం అవసరమైన పేపర్ వర్క్‌ను పూర్తి చేసి అపాయింట్‌మెంట్ లెటర్‌ను రాజ్ కిషోర్‌కు అందజేశారు. అయితే సంకెళ్లుతో నియమాక పత్రం అందుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే లెటర్‌ను రాజ్ కిషోర్‌కి అపాయింట్ మెంట్ లెటర్ వచ్చింది కానీ.. విధుల్లో చేరి చేరకముందే ఆ స్కూల్ నుంచి సస్పెండ్ అవుతాడని లా ఇన్‌చార్జి అమిత్ కుమార్ మిశ్రా అన్నారు. జైలు నిబంధనల ప్రకారం బెయిల్ మంజూరైతే కానీ జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులు విద్యార్థులకు బోధించలేరని చెప్పారు. బెయిల్ మంజూరు అయిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాతనే పాఠశాలలో చేరవచ్చని స్పష్టం చేశారు.