హోటళ్లపై దాడులు.. బెంగుళూరులో తీవ్ర ఉద్రిక్తత
X
కర్ణాటక రాజధాని బెంగుళూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడి హోటళ్లపై కన్నడ సంఘాలు దాడికి పాల్పడ్డాయి. హోటళ్ల నేమ్ బోర్డులను కన్నడలో కాకుండా.. ఇతర భాషల్లో ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ ముందు ఉన్న హోటళ్లకు ఇంగ్లీష్‌లో నేమ్ బోర్డులు ఉండడంతో కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టారు. హోటల్ బోర్డులను ధ్వంసం చేశారు. కన్నడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడులపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులను అడ్డుకున్నారు
తమ నగరంలో ఏర్పాటు చేసిన హోటళ్లకు 60 శాతం కన్నడ బోర్డులే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు కన్నడ రక్షణ వేదిక(KPV) సభ్యులు. ఇతర భాషలతో ఉన్న నేమ్ బోర్డులను వారంలో కన్నడలోకి మార్చాలని సమయం ఇచ్చారు. అయినప్పటికీ కన్నడలో కాకుండా ఇంగ్లీష్, హిందీ నేమ్ బోర్డులనే ఉంచినందుకు ఈ దాడులకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లుగానే ఈరోజు ఉదయమే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని సదహళ్లి గేట్ నుండి కబ్బన్ పార్క్ వరకు ర్యాలీ చేయాలనుకున్నారు ఈ ఆందోళనకారులు. ఇందులో భాగంగానే హోటళ్లపై దాడులకు పాల్పడ్డారు. ర్యాలీ జరుగబోతుందనే విషయం తెలిసి ముందే అధికారుల అక్కడికి చేరుకొని వారిని అడ్డుకన్నారు.