CM Bhagwant Mann:'నా తండ్రి మద్యం తాగి అసెంబ్లీకి వెళతాడు'.. సీఎం కూతురి సంచలన ఆరోపణలు
X
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై ఆయన కూతురు సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని ఆయన కుమార్తె సీరత్ కౌర్ మాన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తాను సీఎం భగవంత్ మాన్ కుమార్తెనని సీరత్ పేర్కొన్నారు. అయితే తాను తండ్రి అని పిలిచే హక్కును భగవంత్ మాన్ కోల్పోయారని.. అందుకే వీడియోలో సీఎం అని, మాన్ అని పిలుస్తానని తెలిపారు. అలాగే తాను ఈ వీడియో చేయడం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. తన కథ బయటకు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే ఇన్నాళ్లు తమ గురించి ప్రజలు ఏదైతే విన్నారో.. అది సీఎం భగవంత్ మాన్ చెప్పింది మాత్రమేనని అన్నారు.
ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని, తన తల్లి కూడా మౌనంగానే ఉందని సీరత్ అన్నారు. ‘‘ మేం మౌనంగా ఉండబట్లే ఆయన ఇంకా సీఎం కుర్చీలో కూర్చున్నాడని, కానీ ఈ విషయం అతనికి తెలియదు’’ అని అన్నారు. అంతేకాకుండా భగవంత్ మాన్ రెండో భార్య గురుప్రీత్ కౌర్ ప్రస్తుతం గర్భవతి అని.. ఆయన మూడోసారి తండ్రి కాబోతున్నారని సీరత్ అన్నారు. ఈ విషయం తనకు ఇతరుల నుంచి తెలిసిందని తెలిపారు. ఈ విషయాన్ని తనకు, తన సోదరుడికి తెలియజేయాలని కూడా భగవంత్ మాన్ ఆలోచించలేదని అన్నారు. ‘‘ మా ఇద్దరిని నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు మూడోవాడిని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనుకుంటున్నావు. దీనికి కారణం ఏమిటి?’’ అని భగవంత్ మాన్‌ను సీరత్ ప్రశ్నించారు.
Very Serious allegations again AAP Punjab CM @BhagwantMann by his daughter.
— Arun Pudur (@arunpudur) December 9, 2023
A must watch.
I did English subtitles for people who aren't fluent in Punjabi. https://t.co/j88lw2iL6x pic.twitter.com/WLWI67nvNq
తన తండ్రిని కలిసేందుకు తన సోదరుడు దోషన్ రెండు సార్లు పంజాబ్ వెళ్లారని.. తండ్రితో సమయం గడపాలని కోరుకున్నాడని సీరత్ చెప్పారు. అయితే దోషన్‌ను ఇంటికి రానివ్వలేదని చెప్పారు. ‘‘సీఎం ఇంటికి వెళితే దోషన్‌ను అక్కడి నుంచి గెంటివేశారని , తన సొంత పిల్లల బాధ్యత తీసుకోలేని వ్యక్తి పంజాబ్ ప్రజల బాధ్యత ఎలా తీసుకుంటాడు?’’ అని సీరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సీఎం మాన్‌కు మద్యం సేవించడం, మానసిక, శారీరక వేధింపులు, అబద్ధాలు చెప్పే అలవాట్లు ఉన్నాయని.. ఇవి కూడా తన తల్లితో విడాకులకు కారణమని చెప్పారు. తన తండ్రి సీఎం హోదాలో ఉండి కూడా మద్యం తాగి అసెంబ్లీకి, గురుద్వారాకు, మీడియా సమావేశాలకు వెళ్తారని సీరత్ ఆరోపించారు. సీరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై భగవంత్ మాన్ ఏం సమాధానం చెబుతారని, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వాటిని ఎలా సమర్ధిస్తారని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.