చనిపోయాడనుకొని శవపరీక్షకు.. ఒక్కసారిగా కదలికలు
X
విషపు పురుగు కుట్టడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ అధికారి చనిపోయాడునుకుని పోస్ట్‌మార్టం కోసం తరలిస్తున్నారు. ఇంతలో ఆయన శరీరంలో కదలికలు రావడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రిలో చేర్పించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. నమ్మశక్యంకాని ఈ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో చోటుచేసుకుంది. లూథియానాకు చెందిన పోలీసు అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషకీటకం కుట్టింది. చేయి వాచిపోయి భరింపలేని నొప్పితో ఆయన విలవిలలాడిపోయారు. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ వ్యాపించడంతో అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు.
ఆస్పత్రిలో చేరిన తర్వాత తన కుమారుడి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని ఆయన తండ్రి, ఏఎస్ఐ రామ్‌జీ తెలిపారు. మరో ఆస్పత్రికి రిఫర్ చేయమని డాక్టర్లను కోరితే.. అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వారు నిరాకరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18 అర్ధరాత్రి మన్‌ప్రీత్ మృతిచెందాడని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని ఆయన ఆరోపించారు. మర్నాడు ఉదయం పోస్ట్‌మార్టం కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా అందులో ఉన్న ఓ పోలీసు అధికారి.. మన్‌ప్రీత్ శరీరంలో కదలికలను గుర్తించారని చెప్పారు. వెంటనే మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, మన్‌ప్రీత్ చనిపోయాడని తమ సిబ్బంది ఎవరూ చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు.