4 నెలల తర్వాత తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ
X
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 4 నెలల తర్వాత పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఘనస్వాగతం పలికి పార్లమెంట్‌లోకి సాదరంగా ఆహ్వానం పలికారు. సోమవారం ఉదయం స్పీకర్ కార్యాలయం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.
లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణవ్వడంతో సోమవారం పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ కు స్వాగతం పలికారు విపక్ష నేతలు. ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరో నేత అధిర్ రంజన్ చౌధరీ నోరు తీపి చేశారు. నేతలంతా స్వీట్లు తినిపించుకున్నారు.
రాహుల్ గాంధీ లోక్‌సభకు చేరుకోగానే బీజేపీ మాటల దాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్‌కు అందుతున్న నిధులపై దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. చైనా నుంచి నిధులు వచ్చినట్లు ఆరోపణలున్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. న్యూస్‌క్లిక్ సంస్థకు డబ్బు అందిందని న్యూయార్క్ టైమ్స్ రాసిందని ఆరోపించారు. ఈడీ దాడులపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సభ్యత్వ పునరుద్ధరణతో రాహుల్ తన ట్విటర్ బయోలో మార్పు చేశారు. ఇంతకాలం డిస్‌క్వాలిఫైడ్ ఎంపీగా ఉన్న స్థానంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా మార్చుకున్నారు.