ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. వాళ్లు ఒప్పుకున్నారన్న సీఎం
X
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ బరిలో నిలుస్తారని చెప్పారు. దీనికి కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు వల్లే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు.
మోదీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని గెహ్లాట్ విమర్శించారు. కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ఆయన.. మిగిలిన 69 శాతం ప్రజలు మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరగదన్నారు. ఇప్పటి వరకు ప్రధాని ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటి అమలు తీరును ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
చంద్రయాన్ 3 సక్సెస్లో నెహ్రూ, ఇందిరా గాంధీ పాత్రలు కీలకమైనవని గెహ్లాట్ గుర్తుచేశారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ సూచన మేరకు నెహ్రూ ఇస్రోను ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పట్లో వారి కృషి ఫలితంగానే ప్రస్తుతం చంద్రయాన్ 3 విజయవంతమైందని చెప్పారు.