దేవుడికే పాఠాలు చెప్తడు.. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సటైర్
X
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ తీరుపై ఫైర్ అయ్యారు. మోడీ సర్కారు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో జరిగిన చర్చా కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. అనంతరం ఎన్నారైలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మోడీపై వ్యంగాస్త్రాలు సంధించారు.
దేవుడికే పాఠాలు చెప్తడు
బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల వర్షం కురిపించారు. ‘అంతా తమకే తెలుసు అని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న ఆయన.. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారని, చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారని, సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారని అన్నారు. ఒకవేళ మోడీ దేవుడి పక్కన కూర్చుంటే ప్రపంచం ఎలా పనిచేస్తుందో భగవంతునికే వివరిస్తాడంటూ సటైర్ వేశారు. అప్పుడు దేవుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు’’ అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాహుల్పై బీజేపీ ఫైర్
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. విదేశాల్లో మోడీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్రపంచదేశాల్లో మోడీకి ఉన్న మంచిపేరును చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించింది. రాహుల్ గాంధీ విదేశాల్లో భారతదేశ పరువు తీస్తున్నాడని పలువురు బీజేపీ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు.
రాహుల్ వ్యతిరేక నినాదాలు
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ అమెరికా సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన మొహబత్ కీ దుకాణ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు వెలిశాయని అన్నారు.