Rahul Gandhi Bungalow: ఆ ఇంటికి వెళ్లనంటున్న రాహుల్ గాంధీ..
X
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలో తాను ఉన్న ఇంటికి వెళ్లనంటున్నారు. దీనిపై పార్లమెంటరీ హౌసింగ్ కమిటీకి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో గతంలో తాను ఉన్న బంగ్లాను అధికారులు తిరిగి కేటాయించారు. అయితే ఆ ఇంటికి వెళ్లేందుకు రాహుల్ నిరాకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 2005 నుంచి ఏప్రిల్లో ఖాళీ చేసేంతవరకు రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్లోనే ఉన్నారు. తనపై అనర్హత వేటు పడ్డాక అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్.. 10జనపథ్ లోని సోనియా ఇంట్లో ఉంటున్నారు.
2019లో కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్..మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ దావాపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మే నెలలో రాహుల్నూ దోషీగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
రాహుల్ ఆ తర్వాత జిల్లా కోర్టును, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రింకోర్టు.. ఈ నెల 4న స్టే ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్సభ సచివాలయం పునరుద్ధరించింది. దీంతో అధికారులు గతంలో తాను ఉన్న ఇంటినే తిరిగి కేటాయించారు.