చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడికి శిక్ష తగ్గింపు!!
X
టీచర్ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కారని ఇటీవల ఓ పిటిషన్ విచారణలో తీర్పునిచ్చిన రాజస్థాన్ హైకోర్టు.. తాజాగా ఓ హత్యాచార కేసు నిందితుడి శిక్షను మార్చేసింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సురేశ్ కుమార్ అనే వ్యక్తికి.. ట్రయల్ కోర్టు మరణ శిక్షను విధించగా.. రాజస్థాన్ హైకోర్టు ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నేరం జరిగినప్పుడు ఆ నిందితుడి వయస్సు 23 ఏళ్లు మాత్రమేనట. అతడికి భార్య, ఏడాది వయసున్న కూతురు కూడా ఉన్నారని జడ్జీలు అతని శిక్షను తగ్గించారు. జస్టిస్ పంకజ్ భండారీ, భువన్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం.. ఆ చిన్నారిపై హత్యాచారం ప్లాన్ ప్రకారం జరగలేదని, సురేశ్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపింది. పోలీస్ కస్టడీలో అతని ప్రవర్తన కూడా చాలా సంతృప్తికరంగా ఉందని, అతడిని సమాజానికి పెను ముప్పుగా భావించలేమని జడ్జీలు అభిప్రాయపడ్డారు. అయితే.. నాలుగేళ్ల చిన్నారిని, అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపేయడం చాలా ఘోరమని గుర్తించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
2021లో జరిగిన దారుణంపై ట్రయల్ కోర్టు 2022లో మరణ శిక్ష విధించింది. దాన్ని ధ్రువీకరించేందుకు హైకోర్టుకు పంపించింది. మరోవైపు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సురేశ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు. చిన్నారి మృతదేశాన్ని చెరువులో నుంచి వెలికి తీసిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని హైకోర్టుకు తెలిపారు. సురేశ్‌ను గ్రామస్థులు పట్టుకున్నప్పుడు ఈ ఘోరం చేసినట్లు అంగీకరించాడని, చిన్నారిని చెరువులో పడేశానని చెప్పాడని సాక్షి తెలిపాడు. సురేశ్ నుంచి తీసుకున్న డీఎన్ఏ నమూనాలు మరణించిన చిన్నారి స్కర్ట్‌పై కనుగొనబడిన డీఎన్ఏతో సరిపోలడంతో అతడే దోషిగా కోర్టు నిర్ధారించింది. ఇక జైలులో అతడి సత్ప్రవర్తన కారణంగా ముందుగా విధించిన శిక్షను ప్రభుత్వం తగ్గించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. తాజా తీర్పుతో అతడు జీవితాంతం జైలు జీవితం గడుపుతాడని తెలిపింది. సురేష్ కుమార్ తరపున న్యాయవాదులు మహేంద్ర కుమార్, మోహన్ చౌదరి వాదించారు. రాష్ట్రం తరపున అదనపు ప్రభుత్వ న్యాయవాది జావేద్ చౌదరి వాదించారు. ఫిర్యాదుదారుల తరఫున న్యాయవాదులు ఫహద్ హసన్, అమన్ అహ్మద్ అలీ హాజరయ్యారు.