రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X
రాజస్థాన్ మంత్రి బాబూలాల్ ఖరాడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఎక్కువ మంది పిల్లలను కనండి. అందరికీ మోడీ ఇండ్లు కట్టిస్తారు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సభలో అక్కడి సీఎం భజన్ లాల్ శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే "మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. మీరు ఎంతమందిని కన్నా అందరికీ మోడీ ఇళ్లు కట్టిస్తారు. అందరికీ ఇల్లు ఉండాలనేదే మోడీ కల..మీకు పిల్లల్ని కనడంలో సమస్య ఏంటీ?" అంటూ నోరు జారారు. దీంతో సీఎం భజన్ లాల్ శర్మతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఒకరిని చూసి ఒకరు గట్టిగా నవ్వుకున్నారు. ఈ పరిణామం బీజేపీని కాస్త ఇబ్బందికి గురి చేసింది. వెంటనే తేరుకున్న మంత్రి మోడీ చేసిన పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడినప్పటికీ.. పిల్లల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా బాబూలాల్ ఖరాడికి ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది సంతానం. ఈ నేపథ్యంలోనే ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. "అందరూ నీలాగే ఉండాలంటే కష్టం.. నువ్వు గ్రేట్" అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలంటూ మరికొందరూ విమర్శిస్తున్నారు. బాబూలాల్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని మహిళా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.