రైల్వే స్టేషన్‌లో స్వీపర్‌కు ప్రసవం..మానవత్వం చాటుకున్న కానిస్టేబుళ్లు
X
పురిటి నొప్పులతో అల్లాడుతున్న ఓ మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆర్‌పిఎఫ్‌కి చెందిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లు. శుక్రవారం ఉదయం రల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ గర్భిణి ఆరోగ్యం క్షీణించడం, రక్తస్త్రావం జరగడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో అప్రమత్తమైన నలుగురు మహిళా కానిస్టేబుళ్లు రైల్వే స్టేషన్లోనే ప్రసవం చేశారు. ఈ క్రమంలో మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ రైల్వే స్టేషన్‌లో స్వీపర్‌గా పని చేస్తున్న పూజ అనే మహిళ తన విధుల నిమిత్తం ఉదయం ప్లాట్‌ఫారమ్ శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. అక్కడ విధుల్లో ఉన్న ఆర్‌పిఎఫ్ జవాన్ వీరేంద్ర సింగ్ ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆయన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రేమరామ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. ప్రేమరామ్ వెంటనే మహిళా కానిస్టేబుళ్లు హంస కుమారి, సావిత్రి ఫగేడియా, లక్ష్మీ వర్మలను సంఘటనా స్థలానికి పంపారు. అప్పటికే పూజ పరిస్థితి విషమించడంతో ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించింది. ఆసుపత్రికి తీసుకెళితే ఆమెకు ప్రాణాపాయం ఉందని కానిస్టేబుళ్లు గ్రహించారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ నుండి ఓ దెప్పటి తెచ్చి గర్భిణికి స్టేషన్లోనే ప్రసవం చేశారు. అనంతరం అజ్మీర్‌లోని శాటిలైట్ హాస్పిటల్‌లో మహిళలను చేర్పించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని మహిళా కానిస్టేబుళ్లు తెలిపారు. మహిళా కానిస్టేబుళ్ల మానవత్వాన్ని పలువురు అభినదింస్తున్నారు.