Home > జాతీయం > ఫాతిమాగా మారి ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజూ

ఫాతిమాగా మారి ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజూ

ఫాతిమాగా మారి ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజూ
X

పెషావర్‌ : ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తిని కలుసుకునేందుకు పాకిస్థాన్‌ వెళ్లిన రాజస్థాన్‌ మహిళ అంజూ మరో ట్విస్ట్ ఇచ్చింది. మతం మారి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని స్థానిక కోర్టులో అంజూ, ఆమె ప్రేమికుడు నస్రుల్లా (29) మంగళవారం పెళ్లి చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. పెళ్లికి ముందు ఇస్లాం స్వీకరించి ఫాతిమాగా పేరు మార్చుకున్న అంజూ.. ఎవరి బలవంతం లేకుండా నిఖా చేసుకుంటున్నట్లు చెప్పిందని అన్నారు. బంధువులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసుల సమక్షంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది అని ఆయన స్పష్టం చేశారు.

పెళ్లికి ముందు అంజూ, నస్రుల్లాలు భారీ భద్రత మధ్య స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో విహరించారు. ఒక గార్డెన్‌లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫొటోలు దిగారు. మరోవైపు తను పాకిస్థాన్ కు వెళ్లడం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని అంజూ చెప్పినట్లు పాక్‌ వార్తా సంస్థ జియో కథనం ప్రచురించింది. తన ప్రేమను వెతుక్కుంటూ పాక్‌ వచ్చానని, ఇక్కడే ఉండిపోతానని అంజూ తమకు చెప్పినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారని అందులో చెప్పింది.

ఇదిలా ఉంటే అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా సోమవారం చెప్పాడు. ఆగస్టు 20న ఆమె ఇండియాకు తిరిగి వెళ్లిపోతుందని చెప్పాడు. వీరిద్దరి వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో నస్రుల్లా అంజూతో తనకున్న రిలేషన్ గురించి చెప్పాడు. అయితే ఈ మాట చెప్పి ఒక రోజు గడవకముందే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

పాక్‎కు చెందిన నస్రుల్లా భారత్‎కు చెందిన అంజుకు ఫేస్‎బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది. 2019 నుంచి వీరు ఆన్‎లైన్‎లో టచ్ లో ఉన్నారు. గత నాలుగేళ్లుగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అంజు నస్రుల్లాను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం ఇరు దేశాల్లో హాట్ టాపిక్‎గా మారింది.

Updated : 26 July 2023 9:26 AM IST
Tags:    
Next Story
Share it
Top