అయోధ్య రాముడి తొలి దర్శనం.. పులకించిన భక్తజనం..
X
అయోధ్య రాముడి తొలి దర్శనంతో భారతావని పులకరించింది. స్వర్ణాభరణ అలంకృతుడైన బాల రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో ఉన్న రామయ్య దివ్య మంగళ రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వంలో ముగినిపోయారు. ప్రసన్న వదనం, చిరు దరహాసంతో ఉన్న నీలి మేఘశ్యాముడిని చూసేందుకు రెండు కన్నులు చాలడం లేదు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ మహా క్రతువును టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో కోట్లాది మంది బాల రాముడిని దర్శించుకుని పులకించిపోయారు.
51 అంగుళాల పొడవున్న బాల రాముడి విగ్రహానికి మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపమిచ్చారు. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట క్రతువు జరిగింది. పద్మపీఠంపై ధనుర్ధారియై బాలరాముడు దర్శనం ఇస్తున్నాడు. ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన అనంతరం నుదుటన వజ్రనామంతో సకలాభరణాలతో రామయ్య అందరినీ కటాక్షించాడు. రామ మందిరంలో కొలువుదీరిన బాల రాముడిని చూసి హిందూ హృదయాలన్నీ ఉప్పొంగిపోతున్నాయి. రామనామ స్మరణతో వీధులన్నీ మార్మోగుతున్నాయి.