Home > జాతీయం > Ram Mandir inauguration: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం.. ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధం

Ram Mandir inauguration: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం.. ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధం

Ram Mandir inauguration: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం.. ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధం
X

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళయింది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది. రామమందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అభిజిత్‌ లగ్నంలో అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈసందర్భంగా అయోధ్యా నగరం రామనామస్మరణతో మార్మోగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు 7 వేల మందికి పైగా ప్రముఖులు, అతిథుల సమక్షంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నది. ఈ మహత్తర కార్య ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లలో వీక్షించనున్నారు. ఈ శుభ ముహూర్తాన దేశ విదేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.

రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యా నగరంవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఏటీఎస్‌ కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గట్టి పహారా కాస్తున్నారు. ఫైజాబాద్ నుంచి అయోధ్యకు వచ్చే ప్రధాన రహదారితో పాటు, ప్రతీ వీధిలో భద్రతా దళాలు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వాహనాలనే అయోధ్య వైపునకు అనుమతిస్తున్నారు. దాదాపు 30 వేల మంది పోలీసులను అయోధ్యలో భద్రతకు మోహరించినట్లు యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు. 10వేల సీసీ కెమెరాలు అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య దారుల్లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) కమాండోలు కవాతు నిర్వహిస్తున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ కోసం ఆహ్వానాలు అందుకున్న ముఖ్య అతిథులు సోమవారం ఉదయం 10 గంటలకల్లా ఆలయానికి చేరుకుంటారు.

వాషింగ్టన్‌ డీసీ నుంచి ప్యారిస్‌.. సిడ్నీ దాకా దాదాపు 60 దేశాల్లో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ వేడుక కోసం శ్రీరామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు, అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. రామమందిరం మొత్తం పూలతో, విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. అయోధ్య వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోని 14 జంటలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నాయి. ఇప్పటికే ఈ నెల 16 నుంచి ప్రారంభమైన వేడుకలు.. మంగళవారం వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎవరికైనా ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది యోగి సర్కార్. ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేసింది. ఎయిమ్స్‌ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు.

Updated : 22 Jan 2024 7:10 AM IST
Tags:    
Next Story
Share it
Top