Home > జాతీయం > Ramnamis: గుడి లేదు.. కేవలం భక్తి మాత్రమే ఉంది.. రామనామీల ప్రత్యేకత ఇదే

Ramnamis: గుడి లేదు.. కేవలం భక్తి మాత్రమే ఉంది.. రామనామీల ప్రత్యేకత ఇదే

Ramnamis: గుడి లేదు.. కేవలం భక్తి మాత్రమే ఉంది.. రామనామీల ప్రత్యేకత ఇదే
X

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కాసేపటి క్రితమే ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ తన చేతులు మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమం వేళ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలోనే కాకుండా పలు రామమందిరాల్లో జనమంతా భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. రామునిపై తమకున్న భక్తిని పలువిధాలుగా చాటుకుంటున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కస్‌డోల్‌కు చెందిన ఓ తెగ మాత్రం రామునిపై తమకున్న భక్తిభావాన్ని పచ్చబోట్ల రూపంలో తెలుపుతోంది. దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో శాంతియుత ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం కారణంగానే చత్తీస్ ఘడ్ లో ని రామనామి సమాజ్ అనే తెగ ఉద్భవించింది. ఈ తెగలోని చిన్నపిల్లలతో సహా అందరూ రామనామాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. కనురెప్పలపై కూడా రాముడి పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంటారు. కాలి నుంచి తల వరకు రాముడి నామం వేయించుకుంటే.. నఖ్ శిఖ్.. అని నుదుటిపైనే పచ్చబొట్టు పొడిపించుకుంటే శిరోమణి అని పిలుస్తారు. కొందరైతే.. రామనామం ఉన్న దుస్తులతో రోజూ భజన చేస్తారు. నిరంతరం రామనామంతోనే ఉంటారు రామనామి తెగ ప్రజలు. రాముడి ఉనికి ప్రతిచోటా ఉంది అనే నమ్మకాన్ని కలిగిఉంటారు. అందుకే ఇప్పటికీ అక్కడ గుడి కట్టుకోలేదు.

1911లో భారీ వర్షాలకు రామనామీ తెగ నదిలో చిక్కుకుపోయింది. తమను కాపాడితే ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తామని మొక్కుకున్నారు. దీంతో ఏటా మూడు రోజుల పాటు ఘనంగా రాముడికి రామనామీలు జాతర నిర్వహిస్తారు. తులసీదాస్ రామచరిత మానస్ లోని పద్యాలు చదువుతూ రాముడికి పూజ చేస్తారు. రామనామీలు లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. నెమలి ఈకలతో రూపొందించిన కిరీటాన్ని తలపై ధరిస్తారు. ఘుంగ్రాలను కూడా ధరిస్తారు. నృత్యాలు చేస్తూ రాముడి భజన చేసేటప్పుడు ఘుంగ్రాలే ప్రధాన ఆకర్షణ. సుమారు వందేళ్లుగా ఏటా మహానది తీరాన ‘బడే భజన్ మేళా’ నిర్వహిస్తున్నారు.. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వేల మంది ఒకే చోట చేరి.. రామచరిత మానస్‌ తో పాటు రామ నామం గురించి భజన చేస్తారు.. ఈ సారి జనవరి 21 నుంచి 23 మధ్య బడే భజన్ మేళా నిర్వహిస్తున్నారు. కాగా, గులారామ్ రామనామీ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు వేల మంది రామనామీలు రామాయణంలోని కీర్తనలు ఆలపించి, రామాయణాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన నిర్వహిస్తారు అని చెప్పాడు. ఈసారి మేం మేళా నిర్వహించే సమయానికి అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతోంది అని చెప్పాడు. రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగ మాది అని గులారామ్ పేర్కొన్నారు.

Updated : 22 Jan 2024 7:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top