ఎలుకల పనికి పోలీసుల షాక్.. నిందితులు రిలీజ్
X
ఆడుతూ పాడుతూ సినిమాలో ఓ ఎలుక సునీల్ పాస్ పోర్టును కొరికేస్తుంది. దీంతో సునీల్ విదేశాలకు వెళ్లలేకపోతాడు. అయితే ఇక్కడ ఎలుకలు గంజాయిని తినేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22కిలోల గంజాయిని తిన్నాయి. ఎలుకలు చేసిన పనికి పోలీసులు షాక్ తింటే.. నిందితులు కేసు నుంచి హాయిగా బయటపడ్డారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.
మూడేళ్ల క్రితం చెన్నై మెరీనా బీచ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై విచారణ ప్రారంభించి చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులైన రాజగోపాల్, నాగేశ్వరరావుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆ చార్జిషీట్లో పేర్కొన్నారు. అందులో 50 గ్రాముల గంజాయిని టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సాక్షాధారాలు చూపించాల్సి రావడంతో పోలీసులు కేవలం 50గ్రాముల గంజాయిని మాత్రమే చూపించారు. మిగితా గంజాయి ఎక్కడా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఎలుకలు తినేశాయి అని వివరించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. గంజాయి మొత్తాన్ని పోలీసులు చూపించకపోవడంతో కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులైన రాజగోపాల్, నాగేశ్వరరావులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.