Rivaba Jadeja : మీడియా ప్రశ్నలకు గట్టిగా బదులిచ్చిన రవీంద్ర జడేజా భార్య
X
తన కొడుకును క్రికెటర్‌ను చేయకపోయి ఉంటే బాగుండేదని ఇటీవల టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సిన్హా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. తమ కుటుంబంలో నెలకొన్న సమస్యలన్నింటికీ కోడలు రివాబానే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ తన కొడుకును ఎంతో కష్టపడి క్రికెటర్‌ను చేశానని.. కానీ ప్రస్తుతం తన కొడుకును కలిసే అవకాశం కూడా లేకుండా పోయిందని మీడియా ముఖంగా చెప్పడంతో.. రవీంద్ర జడేజా కుటుంబ విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే తన తండ్రి ఆరోపణలను రవీంద్ర జడేజా ఖండించాడు. సదరు ఇంటర్యూ ముందస్తు ప్రణాళికతో చేసినదని, తన భార్య ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఇలా చేశారని మండిపడ్డాడు. ఇరువర్గాలను సంప్రదించిన తర్వాతే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందని అన్నాడు. అయితే మామ ఆరోపణలపై రవీంద్ర జడేజా భార్య, జామ్ నగర్ ఎమ్మెల్యే రివాబాకు ప్రశ్న ఎదురైంది. ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన రివాబాను అక్కడున్న ఓ విలేకరి.. ‘‘మీ మామగారు కొన్ని ఆరోపణలు చేశారు. వాటిపై మీ స్పందనేంటి?’’ అని ప్రశ్నించగా.. ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఏంటి? మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా నన్నే సంప్రదించండి. ఇక్కడ మాత్రం కాదు’’ అంటూ గట్టిగా బదులిచ్చారు. అటు, తండ్రి ఆరోపణలను రవీంద్ర జడేజా కూడా తోసిపుచ్చారు. ఏకపక్షంగా ఉన్న ఆ ఆరోపణలను నేను ఖండిస్తున్నానని, ఇది ముందస్తు ప్రణాళికతో రూపొందిన ఇంటర్వ్యూ అని మండిపడ్డారు. కాగా జడేజా, రివాబాకు 2016లో వివాహం అయింది. వారికి ఓ కూతురు కూడా ఉంది. రివాబా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.